15 రోజుల్లోగా పరిష్కరించకుంటే సమ్మే ! 1 m ago
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. అందులో భాగంగా సోమవారం అన్ని మున్సిపల్ కార్యాలయాల ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మున్సిపల్ కమీషనర్లకు వినతిపత్రాలు సమర్పించారు. చట్టబద్ధమైన సౌకర్యాలు, సెలవులు, రక్షణ పరికరాలు, వాహనాల మరమ్మతులు, పనిముట్లు సకాలంలో ఇవ్వకపోవడం, యూనిఫాం, చెప్పులు, సబ్బులు, నూనెలు, టవల్స్ ఇవ్వడంలో జాప్యం చేయడం జరుగుతోందని ఈ సందర్భంగా కార్మికులు ఆరోపించారు. పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను ఏళ్ల తరబడి నుండి పెంచడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను ఇతర పనులకు వాడుకోవడం వల్ల మిగిలిన కార్మికుల పైన రోజు రోజుకు పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గతంలో పలు పర్యాయాలు విన్నవించినా నేటికీ అవి పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 15 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. పరిష్కరించని పక్షంలో సమ్మెకు పూనుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు.
కార్మికుల డిమాండ్లు ఇలా...
1. పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలి.
2. ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, ఎన్ఎంఆర్, కోవిడ్, బదిలీ మరియు క్లాప్ డ్రైవర్ల కు చట్టబద్ధమైన వారాంతపు, క్యాజువల్, జాతీయసెలవులు పక్కాగా అమలుచేయాలి.
3. పనిముట్లు, రక్షణ పరికరాలు, భద్రతాసౌకర్యాలు కల్పించడం, వాహనాల మరమ్మతులు యూనిఫాం, చెప్పులు సబ్బులు, నూనెలు, టవల్స్ సకాలంలో ఇవ్వాలి. ఈ పిఎఫ్, ఈఎస్ఐ అమలు లో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలి.
4. ఈపిఎఫ్ కి సంబంధించిన ఖాతాలను ఒకే ఖాతా క్రిందకు తీసుకొని రావాలి.
5. సాధారణ మరియు ప్రమాదం లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో బకాయిలు చెల్లించాలి.
6. అప్కాన్ ద్వారా రిటైర్మెంట్ చేసిన కార్మికుల పిల్లలకు ఉపాధి కల్పించాలి.
7. ఇంజనీరింగ్ కార్మికులకు జీఓ ఎంఎస్ నెంబర్: 11, తేది: 17/1/2012 ప్రకారం స్కిల్ట్, సెమీస్కిల్డ్ విధాన నిర్ణయం ఆధారంగా జీతాలు చెల్లించాలి. లేదా జీఓ ఎంఎస్ నెంబర్: 36, తేది: 1/3/2024 ప్రకారం అందరికీ రూ॥ 21000/- లు జీతం చెల్లించాలి.
8. పర్మినెంట్ సిబ్బందికి సరెండర్ లీవులు, డిఏ బకాయిలు, జిపిఎఫ్ అకౌంట్లు తదితర సమస్యలు పరిష్కరించాలి.
9. క్లాప్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత, జీఓ ఎంఎస్ నెంబర్: 36, తేది: 01/03/2024 ప్రకారం జీతం రూ॥24500/-లు చెల్లించాలి. ప్రతి నెల 7వ తేదీ లోపు జీతాలు చెల్లించాలి.
10. గత 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించి మినిట్స్ కాపీలో పేర్కొన్న, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్లో ఉన్న ఎ) రిటైర్మెంట్ బెనిఫిట్స్, బి) ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేషియో 5 నుండి 7 లక్షలకు పెంపు, సి) దహన సంస్కారాల ఆర్థిక సహాయం 15 వేల నుండి రూ. 20,000/-లకు పెంపు, డి) ఇంజనీరింగ్ కార్మికుల జీతాల నిర్ణయం మొదలైన వాటికి వెంటనే జి.ఓ.లు జారీ చేయాలి.
11. 17 రోజుల సమ్మెకాలం జీతం, పండుగ కానుక రూ. 1000/-లు వెంటనే చెల్లించాలి.
12. విజయవాడ వరదల ముంపు సందర్భంగా "శానిటేషన్ స్పెషల్ డ్రైవ్"లో పాల్గొన్న కార్మికులు అందరికీ ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలి. అలాగే ప్రభుత్వం ఇస్తామన్న రెండు జతల బట్టలతోపాటు, కుట్టుకూలి ఛార్జీలు కూడా చెల్లించాలి.
13. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులను నివారించాలి. సుప్రీంకోర్టు సూచనల మేరకు కంప్లెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలలో మహిళా కార్మికులను సభ్యులుగా చేర్చాలి.